Analog Love in Digital Age (in Telugu)

డిజిటల్ యుగం లో అనలాగ్ ప్రేమ


ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఏమో! నేను ఫోటోగ్రఫీ మొదలుపెట్టింది, నేర్చుకుంది,
తప్పటడుగులు వేసిందీ, మొదటి అవార్డు గెలుచుకుందీ ఒక ఫిలిం కెమేరాతోనే.
ఇప్పటికీ నా దెగ్గర నాలుగు డబ్బులు ఉంటె ఒక రోలు 35mm కోడాక్ ఫిలిం
కోనేసుకుంటాను. స్నేహితులతో కలిసి ఏదైనా కొత్త ప్రదేశానికి వెలితే రెండు
లేక మూడు రోల్స్ తీసుకువెళ్ళే పరిస్థితి. మొత్తంగా 36 X 3 = 108 ఫోటోలు మాత్రమె
తీసుకోవచ్చు కానీ అవ్వి ఎప్పుడూ తక్కువనిపించలేదు. 


ఒక ఫొటోగ్రాఫ్ క్లిక్ మనిపించేముందు ఈ ఫోటో నేను తీయడం ముఖ్యమా?
తీయకుంటే రాత్రుళ్ళు నిద్రపట్టనంతగానా? అవునా? అయితే సరే, లేదంటే అలా
చూస్తూఉండమని నాకు నేను చెప్పుకునేవాణ్ని. ఒక వినయం, విధేయత, విచక్షణ,
క్రమశిక్షణ అలవాటు కావడానికి ఈ ఫిలిం ఫోటోగ్రఫీ కారణమయ్యింది.
నిజం చెప్పాలంటే, ఇవ్వాల్టి డిజిటల్ కెమెరా యుగంతో పోల్చుకుంటే నా మెదడు
ఇంకాస్త బెటర్ గానే పనిచేసేది. ఇప్పుడసలు కెమెరాని మెషిన్ గన్ లాగ వాడితే
తప్ప వీడు ఫోటోగ్రాఫర్ అని అనరు కాబోలు, షట్టర్ అరిగిపోయ్యేలా వేలకు వేలు
ఫోటోలు క్లిక్ మనిపించేస్తున్నాం. చిన్నప్పుడు క్రికెట్ మ్యాచెస్ బెస్ట్ అఫ్ త్రీ ఆడేవాళ్ళము,
అట్లాగే ఫోటో కూడా ప్రతీ సీన్ ని మూడు షాట్స్ తీసి, ఏది బాగుంటే అది
వాడేసుకున్తున్నాం కదా! మరి తీసిన ఫోటో కెమెరా తీసినట్టా? ఫోటోగ్రాఫర్ తీసినట్టా?
మనని మనం ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


ఫిలిం రోల్ తో ఫోటో తీయడం ఒక ఎత్తయితే ఆ ఫోటోని మంచిగా ప్రింట్ చెయ్యడం
ఒక యుద్ధమే, ఒక యజ్ఞమే. డిజిటల్ ఇంక్ జెట్ ప్రింట్స్ కూడా మంచి క్వాలిటీ తో
తీయడం అంత సులువైన పనేం కాదు, దానికి ఏంతో స్కిల్, నాలెడ్జి కావాలి.
కానీ డార్క్ రూమ్ లో తీసిన ప్రింట్ క్వాలిటీ ముందు ఈ డిజిటల్ క్వాలిటీ
సరితూగలేదని నా అభిప్రాయం. అట్లాగని అందరు పెద్ద ఫోటోగ్రఫర్లూ వాళ్ళ
ప్రింట్స్ వారే వేసుకున్నారంటే పొరబాటే. ఆన్సల్ ఆడమ్స్, ఎడ్వర్డ్ వేస్టన్,
ఇమోగెన్ కున్నిన్ఘం లాంటి f64 లెజెండ్స్ మాట వేరు. ఇప్పటికీ ప్రపంచంలోని అన్నీ
పెద్ద ముజియంలలో క్లాసిక్ బ్లాక్ & వైట్ సెక్షన్లో వీరి ఒరిజినల్ ప్రింట్స్ తప్పకుండా
ఉంటాయి. ఆ ప్రింట్స్ ముందు నిలబడి, అదృష్టం ఉండి చేత్తో పట్టుకుని ఎంతోసేపు
దీక్షతో చూస్తేతప్ప మనకు ఆ క్వాలిటీ అర్థం కాదు కాక కాదు. మాగ్నమ్ ఫొటోస్
వారికి స్పెషలిస్ట్ డార్క్ రూమ్ ప్రింటర్స్ ఉండేవాళ్ళు. హెన్రి-కార్టిఎర్ బ్రేస్సన్,
డెన్నిస్ స్టాక్ తీసిన ఫోటోలను ‘పాబ్లో ఇనిరియో’ అనే స్పెషలిస్ట్ డెవలప్ చేసి ప్రింట్
తీసేవాడు. రిచర్డ్ అవేడాన్ ప్రింట్స్ ఆయనకున్నఇద్దరు అసిస్టెంట్స్ వేసేవారు,
మన రఘు రాయ్ మాత్రం ప్రింటింగ్ తానే వేసుకునేవాడని విన్నాను.


ఒక ఫోటోగ్రాఫర్ కూ తాను డార్క్ రూమ్ లో డెవలప్ చేసిన ఫోటోగ్రాఫ్స్ కి ఉన్న
సంబంధం, ఒక తల్లికీ తన బిడ్డకీ ఉన్న సంబంధం ఒకేలాగా అనిపిస్తుంది నాకు.
మొదట ప్రేమించి, ప్రేమలోనే ఉండి, గర్భం దాల్చి, నవమాసాలూ మోసి, కడుపులోని
బిడ్డ క్షేమంగా ఉండాలని అన్ని జాగ్రతలూ తీసుకుని, మగవాడి ఊహకు కూడా
అందని పురిటి నొప్పులు అనుభవించి, శారీరికంగా ఎంత ఇబ్బందిగా ఉన్నా
చిరునవ్వుతో తన బిడ్డని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తుంది తల్లి. తన బిడ్డ పెరిగి
పెద్దదై ఎంతో గొప్ప గొప్ప పనులు చేస్తుందనీ, అందరి మెప్పూ పొందుతుందనీ,
సమాజం గర్వించదగ్గ పేరు ప్రతిష్టలు తెచ్చుకున్టుందనీ కలలు కంటుంది. నిజానికి
ఆ బిడ్డ రాజవుతాడో లేక రాక్షసుడవుతాడో సమయమే చెప్తుంది, ఏది ఏమైనా తన
బిడ్డ ఆరోగ్య క్షేమాలే తన పరమావిధిగా తిప్పలు పడుతుంది తల్లి. పుట్టి ఒక రోజైనా
కాకున్నా, ఎప్పుడెప్పుడు తనవంక చూసి బోసినవ్వు నవ్వుతాడని ఎదురుచూస్తుంది.
గోరు వెచ్చని నీటితో బిడ్డ కంట్లో సబ్బు వెళ్ళకుండా చాలా జాగ్రతగా స్నానం చేయిస్తుంది.
నీళ్ళల్లో చాలాసేపు ఆడుకోవానుకుంటున్న బిడ్డను, జలుబు చేసేస్తుందని తాను
ఏ పనిలో ఉన్నా పరిగెత్తుకునొచ్చి తువాలలో చుట్టేస్తుంది. బిడ్డ ఒంటినిండా పూసిన
పౌడరు వాసనకు, దేవుడి ముందున్న సాంబ్రాణి పొగలకు తన్మయత్వం చెందిన
భక్తురాలవుతుంది తల్లి. తన బిడ్డతో ఎన్ని గంటలైనా గడిపేస్తుంది తల్లి, రకరకాల
మాటలు పాటలతో కథలు చెప్తుంది, ఘడియారం వంక మళ్ళీ మళ్ళీ చూస్తూ బిడ్డ
ఆకలీ అని ఏడవకముందే పాలు పట్టిస్తుంది, చిన్ని చేతులు పట్టుకుని ఆడిస్తుంది,
నడిపిస్తుంది. ఎక్కడ అలిసిపోతుందోనని జోకొట్టి నిద్రపుచ్చుతుంది. బిడ్డ నాకేం
తక్కువ అని పొగరుగా సమాధానమిస్తే తిడుతుందీ. వినయ విధేయతలు
మరచిపోయి కళ్ళు నెత్తిమీదకెక్కినట్టు ప్రవర్తిస్తే, బిడ్డని కొడుతుంది కూడా.
అయ్యో తానెంత కటినాత్మురాలనని ఒక్కత్తే మౌనంగా ఏడుస్తుంది. తప్పులు చేస్తే
మన్నిస్తుంది, తప్పులు చెయ్యకుండా కనబడ్డ ప్రతీ దేవునికీ ప్రార్థిస్తుంది. ఒక చిన్న
మంచిపని చేసినా, తనివితీరా ముద్దులుపెట్టి కౌగిలించుకునే అమ్మ… తన బిడ్డ కన్నూ
మిన్నూ కానక చెయ్యరాని తప్పు చేస్తే వాణ్ని అగ్నికి ఆహుతి చేయడానికి కూడా
వెనకడుగేయదు. సంతోషం, దుఃఖం, కోపం, దయ, భయం, ఇంకా ఎన్నెన్నో
పేరులేని, పేరు పెట్టలేని భావోద్వేగాల సమ్మేళనం ఈ అద్వితీయమైన సంబంధం.
ఒకవేళ మీరు డార్క్ రూమ్ లో ప్రింట్స్ తీసినవారు అయ్యుంటే, నేను చెప్పిన విషయాలు
మీకున్న ఎన్నో జ్ఞ్యాపకాలను మళ్ళీ తెరముందుకు తెచ్చిఉంటాయి.


ఈ డిజిటల్ యుగంలో, ఒక డిజిటల్ కెమెరాలో బెస్ట్ అఫ్ త్రీ గా పెంచుకున్న ఒక డిజిటల్
ఫొటోగ్రాఫ్ ను ఏరకమైన సంబంధంతో పోల్చిచూడాలో నాకైతే అర్థం కావడంలేదు,
అసలు పోల్చిచూడాలన్న ఆలోచన కూడా అనవసరమేమో. ఐ రియల్లీ అండ్ హోల్ హార్టెడ్లీ
మిస్ ట్రెడిషనల్ ప్రింటింగ్, అంతేకానీ డిజిటల్ ప్రింటింగ్ ని తక్కువచెయ్యడం నా ఉద్దేశ్యం
ఎంతకన్నా కాదు. డిజిటల్ ఫొటోగ్రఫీని ఎంచుకుని ఏమాత్రం తొందరపాటు పడకుండా
ఒక్క ఐడియా పైన కొన్ని సంవత్సరాలపాటు నిర్విరామంగా పనిచేస్తున్న కళాకారులకు
నా సలాం. ఇప్పుడు ఫోటోగ్రఫీ నేర్చుంటున్న యువతకు మాత్రం నేను నిష్కపటముగా
త్రికరణశుద్దిగా సూచిన్చదలచుకున్నది ఏంటంటే, మీరు కొన్ని డబ్బులు పోగేసుకుని ఒక
ఫిలిం కెమెరా కొనుక్కోండి. స్వంతగా ఫిలిం డెవలప్ చేస్కొని ప్రింట్స్ తీస్కుంటే చాలా
సంతోషం, లేదంటే అట్ లీస్ట్ ఫిలిం తో ఫోటోగ్రఫి ప్రాక్టీసు చెయ్యండి.

ఫోటోలంటే ప్రపంచాన్ని తీస్కోవడం కాదు, ప్రపంచాన్ని చూడడం అని తెలుసుకోండి.


“లెటర్స్ టు ఎ స్ట్రేంజర్”

సంతోష్ కోర్తివాడ      

Copyright © All rights reserved.
Using Format