Binary Opposite (in Telugu)


వ్యతిరేకం

భాష నేర్చుకుంటున్నప్పుడు మనకు పదాలు, వాటి అర్థాలు, వ్యతిరేక పదాలు నేర్పుతారు. రేయ్! కొన్ని వ్యతిరేక పదాలు చెప్పండ్రా… అని మాష్టారు అడగ్గానే మనం ఠాక్కుమని ఆడ-మగ, పొట్టి-పొడుగు, దేవుడు-దయ్యం, మంచి-చెడు, న్యాయం-అన్యాయం, పుట్టుక-చావు అని తడుముకోకుండా చెప్పేస్తాం. బాగా బట్టీ కొట్టి నేర్చుకున్నవాయె, ఇవన్నీ మనం మామూలుగా మర్చిపోలేము. కానీ, కాలక్రమేణా మన జీవన ప్రయాణంలో మన ఆలోచనలలో మార్పు రావడం సహజం. మన అనుభవాలవల్ల నేర్చుకున్న పదాల అర్థాలు మారిపోవడం, మొదటి అర్థాల స్థానంలో కొత్త అర్థాలు చేరిపోవడం జరుగుతుంటాయి. మనను పెంచిన కుటుంబం, మనం పెరిగిన సమాజ సంస్కృతులమేరకు, వారి వారి చదువు సంస్కారాలు, మేధాత్మ పరిపక్వతలను బట్టి అర్థాల సరళత(simplicity), సంక్లిష్టతలు(complexity) నిర్ధారింపబడతాయి.

ఫొటోగ్రఫీ పిచ్చి మొదలయ్యిందెగ్గర్నించీ, నా మనసుకు బాగా నచ్చి, అట్లాగే నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టిన వ్యతిరేక పదాలు ‘సృష్టి-వినాశనం’ (creation-destruction). సృష్టి అంటే మంచిదనీ, వినాశానమంటే చెడుదనీ మనకు నేర్పుతారు పెద్దలు. నిజమే! ఏదైనా తయారు చేస్తే మంచి పని కానీ, విరగ్గొడితే తప్పేకదా. మన పురాణ ఇతిహాస సాహిత్యాలల్లో ఈ విషయం గురించి సుదీర్ఘమైన వాదోపవాదాలు, వాడివేడి చర్చలు చాలానే ఉన్నాయ్. ఈ బోడి చర్చలు మనకెందుకులే అనుకుంటే, ఇక్కడే ఈ విషయం మర్చిపోవచ్చు. కంటికి కనబడుతున్న విషయాన్ని దాటి, లోతుగా పరిశీలించాలకున్న వారికి ఇల్లాంటి బోడి విషయాల్లో పరిచయం, పరిజ్ఞానం అవసరం. ముఖ్యంగా, ఒక మంచి కళాకారుడికి, కళాచరిత్రతో బాటు ఇలాంటి తత్వతర్కాల విషయాల్లో జ్ఞానం ఉండడం చాలా అవసరమనిపిస్తుంది. మొత్తానికి ఈ చర్చల్లో సమాధానం దొరకడం అసంభవం కానీ, ఒక అవగాహన మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది.

సృష్టి-వినాశన విషయం గురించి ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎంతాలోచించానో నాకు గుర్తులేదు కానీ, ఆ ఆలోచనలనుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను, అందులో నాగురించి నేను నేర్చుకున్నదీ ఎక్కువే. అయితే నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, చిన్నప్పటినుండీ వ్యతిరేక పదాలనుకున్న సృష్టి-వినాశనాలు, నిజానికి పర్యాయపదాలు(synonims) అని. ఇప్పుడు నా ఉదేశ్యంలో సృష్టి, వినాశనం రెండూ సమానమే, రెండూ ఒక్కటే!

హిందూ మహాసముద్రతీరంలో సంధ్యవేళ సాగిపోతున్న మత్స్యకారుల నావ పెయింటింగ్ చూసి మనం ఒక అందమైన అనుభూతికి లోనయ్యామనుకుందాం. చూసినవాడు కళాపోషకుడైతే, “అబ్బ! ఏం వేసాడండీ… అచ్చం నిజదృశ్యం మన ముందున్నట్టే ‘సృష్టి’ చేసాడు” అని ఒక కాంప్లిమెంట్ కూడా ఇస్తాడు. నాలాంటి వాడొకడు పక్కనుంటే, “అబ్బా! వీడెవడండీ బాబు? మల్లెపూవు లాంటి తెల్లటి కాన్వాస్ ని రంగులతో నింపి ‘నాశనం’ చేసాడు” అంటాడు. అయితే, ఆ కళాకారుడు సృష్టించినట్టా? నాశానంజేసినట్టా? రెండూ ఒకేసారి ఏకకాలంలో జరిగినట్టు అనిపించట్లేదూ?

ఎరుపు రంగులో ముంచిన కుంచె, తెల్లటి కాన్వాస్ పైన మొదటి బిందువును సృష్టించిన దెగ్గరినుండీ, మొత్తం పెయింటింగ్ సృష్టింపబడేవరకు… ఆ తెలుపు నాశనం అవుతుండగానే రంగులసృష్టి కూడా జరుగుతున్నది… సృష్టి జరిగేకొద్దీ, వినాశనం అవుతూనేఉంది. ఏకకాలంలో వినాశనం జరిగితే తప్ప ఏ సృష్టీ సంభవం కాలేదనిపిస్తూంది. కాలం కూడా అంతేకదా! పాత క్షణం నాశనమవుతుండగా, కొత్త క్షణం ఆవిర్భావమవుతుంది. కంటికి కనిపించకుండా పరిగెడుతుంది కాబట్టి ఈ ఏకకాల చర్యలను మనం ఒడిసి పట్టుకోలేకపోతున్నాం. మనం వాడుకోడానికి వీలుపడే ఒక కుండను సృష్టించడానికి, పొడిగా ఉన్న మట్టిని తీసి, పచ్చిగా ఉండే నీటిని పోసి, ఆ మిశ్రమాన్ని మెత్తటి ముద్దగా పిసికి, గిర్రున తిరిగే చక్రం పైన ఆ మట్టి ముద్దను పాత్రగా మలచి, ఆ పచ్చి పాత్ర విచ్చుకోకుండా మంటల్లో కాలుస్తారు. నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశమనే పంచ భూతాల ఆది స్వరూపం విధ్వంసమయితే తప్ప, మనం ఒక కుండను సృష్టించలేము. కానీ, మనకు తెలిసిన ఆ ఆదిస్వరూపం కూడా ఇంతకుముందు వేరే స్వరూపంలో ఉండవచ్చుననే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నల్లా తిప్పితే వచ్చిన నీరు, ఇంతకుమునుపు నదిలో ప్రవహించి, ఆవిరై, మేఘమై, వర్షమై, మళ్ళీ నీరై మన కుండలో చేరినట్టన్నమాట. For the process of creation to occur, the original state of the matter must be destroyed in chorus. We must remember that the original state of the matter is once different from the current one.

విధ్వంసం, వినాశనం అన్న పదాలు విన్న ప్రతిసారీ అవేవో భయంకరమైన విషయాలనుకోవడం పెద్ద పొరబాటు. వాడుక భాషలో మనం ఈ పదాలను ప్రతికూల సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగించాం కాబట్టి, వీటిని నిజరూపంలో దర్శించడం కాస్త కష్టమైన పనే. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తే తాను నిండుగర్భిణీ అయ్యిందని బిడ్డను కడుపులోనే దాచుకోదుకదా తల్లి. పండంటి బిడ్డ ఈ ప్రపంచంలో ఊపిరి తీసుకోవాలంటే, తొమ్మిది మాసాల తరువాత, ఆ తల్లి నిండుగర్భం ఖాళీ కావలసిందే. సృష్టి సంపూర్ణమై నశించి పునఃసృష్టి కాబడుతుంది, అది మళ్ళీ నశించి మార్పుచెంది కొత్త సృష్టి పుడుతుంది. అందుకే, ‘సృష్టి-విధ్వంసం’ రెండుగా కనబడుతున్న ఒక్క పదార్థమని నా భావన, నా కళాభావజాలానికి పునాది.


‘లెటర్స్ టు ఎ స్ట్రేంజర్’ బై సంతోష్ కొర్తివాడ

5/7/2018