Dark Lights (in Telugu)

చీకటి వెలుగు


నిద్రమబ్బు కళ్ళతో కిటికీ వైపు చూస్తే బయటింకా చీకటిగానే ఉంది. ఈరోజు ఆదివారం కదా, ఇంకొంచెం సేపు నిద్రపోవచ్చని నాలో నేనే గొనుక్కున్నాను. ఫోన్లో అలారం మోతకు మెలకువయ్యింది నాకు. ‘అదేందీ? బయటేమో ఇంకా పొద్దు పొడవనేలేదు, సెలవురోజు సుబ్బరంగా తొమ్మిదిన్నరకు మొగాల్సిన అలారం ఇప్పుడే మోగుతుందేందీ’ అని ఆశ్చర్యం వేసింది. కొత్త ఫోన్ కొని మూడ్నెల్లు కూడా కాలేదు, అప్పుడే ముసిల్దయిపోయింది… దాని ఇష్టమోచినప్పుడు అలారం మొగిస్తే ఎలా? అని విసుక్కుంటూ, నిండా కప్పుకున్న చెద్దర్ని పరమ లేజీగా పక్కకు తోసి, కిటికీ పక్కన టేబిల్ పైనున్న ఫోన్ కోసం మంచం దిగాను. ఇంతకుమునుపు మంచం పక్కన్నే ఫోన్ ఉంచుకునేవాన్ని. అలారం ఆఫ్ చేసేసి మళ్ళీ పడుకుని, ఒకట్రెండు సార్లు చేయాల్సిన పనులను లేట్ గా వెలగబెట్టాను. ఫోన్ మన మంచానికి కాస్త దూరంలో ఉంటె, నాలుగు అడుగులేస్తాం, నిద్దరమబ్బు ఒదుల్తుంది, టయానికి పనులు చేస్కోవచ్చనే ఇంటెలిజెంట్ ఐడియా వేసిన ఇంటెలిజెంట్ ఫెల్లో నేనే.

‘అబ్బా! నా కాలు’… చీకట్లో దేనికో కొట్టుకున్నట్టున్నా. హమ్మ! దెబ్బకు నిద్ర దెయ్యం వదిలింది. చుట్టూ చూసాను, బెడ్ లైట్ కూడా వెలగట్లేదంటే, కరెంటు పోయినట్టుంది. ‘వెధవ కరెంటు… ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది పోతుంది.’ చల్లని గాలి నా ఒంటికి తగుల్తూ ఉంది, కిర్రు కిర్రుమంటూ సీలింగ్ ఫ్యాన్ తిరుగుతున్న చప్పుడూ వినబడుతూంది, మరి, కరెంటు పోతే ఫ్యాన్ పనిచెయ్యగూడదు కదా? ‘స్ స్ స్ స్!’ కాలికి దెబ్బ గట్టిగానే తాకింది, కోపంలో కూడా నొప్పి గుర్తుకొచ్చింది. గోడను తడుముతూ, ఎలాగో స్విచ్చులన్నీ ఆన్ ఆఫ్ చేసినా, లైట్లు వెలగలేదు. ‘కొంపదీసి, యే దిక్కుమాలిన హార్ట్ అటాకో వచ్చి నిద్దర్లోనే పైకి పోయానా ఏంది?’ పడుకునే ముందు పిశాచపు సినీమాలు చూస్తె, ఈ రకమైన సందేహాలే ఒస్తాయని నాలో నేనే చిన్నగా నవ్వుకున్నాను.

మా పక్కింటోల్ల డొక్కు కారనుకుంటా, రివర్స్ చేసినప్పుడల్లా కి కి క్కి కి క్కీ అని కీచురు గొంతేసుకుని అరుస్తుంది. ‘ఇంకా తెలవారనేలేదు ఎక్కడికెల్తున్నారబ్బా?’ కిటికీ అవతల బట్టలు ఉతుకుతూ, రాజమ్మ ఎవర్తోనో మాట్లాడుతున్నట్టుంది. ఇంట్లో విషయాలూ, ఊర్లో విషయాలు సరిపోలేదనుకుంటా… నిన్న రాత్రి చూసిన చెత్త సీరియల్లో, సుజాత ఎందుకు కొండల్ రావు చెంపలు వాయించిందోనని డిస్కషన్ పెట్టింది. అయినా, ఎవరి కాలక్షేపం వాళ్ళది, అవన్నీ నాకెందుకులే అని మనసులో మాట్లాడుకున్నాను. నా తల మధ్యలోంచి సన్నగా కారుతున్న చెమట తడి మళ్ళీ ఈ లోకంలోకి తీసుకొంచ్చింది నన్ను. అన్ని శబ్దాలూ బాగానే వినబడుతున్నై కానీ, నాకెన్దుకేమీ కనబడట్లేదనే ఆక్రోశం నా వెన్నులో చలి పుట్టించింది. ‘ఇదంతా కల కాదుగదా? ఏమో! కలే కావచ్చు.’ కాసేపు నా రెండు కళ్ళూ గట్టిగా మూసుకున్నాను. నేను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఈ పీడకల సమాప్తమైపోవాలని, కష్టమొచ్చినప్పుడే గుర్తుకొచ్చే దేవుడికి మొక్కుకున్నాను. కానీ, ఇది కల కాకపోతే? కళ్ళు తెరవాలంటేనే భయంగా ఉంది. ఇదేం బాగాలేదు, నాకస్సలు నచ్చట్లేదు. గట్టిగా ఊపిరి తీసి, శ్వాస బిగపట్టి, మెల్లిగా కళ్ళు తెరిచాను.

చీకటి, కటిక చీకటి, మొత్తం అంతా చీకటి. నన్ను నేను తడుముకున్నాను, ఇది నిజమేనని నిర్ధారణ అయ్యింది. నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నా మొహం తడిసి ముద్దైపోయింది. అది చెమటో, ఏడుపో అర్థం కాలేదు. గట్టిగా అరవాలనుకున్నాను, కానీ గొంతు పెగలట్లేదు. తడి ఆరిపోయిన కంఠంలోనే మాట ఆగిపోయినట్టుంది. ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అని గుర్తు చేసుకుంటున్నాను. అంతా అయోమయంగా ఉంది. ఆ! గుర్తోచింది… నా దోస్త్ రవి ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి నాతోబాటు టీవీలో సినిమా చూస్తూ, హాల్లోనే సోఫాలో పడుకున్నాడు. ఒంట్లో ఉన్న శక్తినంతా ఉపయోగించి ‘రవీ’ అని గట్టిగా అరిచాను. పెద్ద చప్పుడు వినిపించింది నాకు. ‘ఏమైందిరా?’ అంటూ గభాల్న తలుపు తోసుకుని వస్తున్నట్టున్నాడు. మంచం దెగ్గర ఆపాదమస్తకం తడిసిపోయి, భయంతో వణుకుతూ నిలబడి ఉన్నాను. ‘రేయ్! ఏమైందిరా? దెయ్యం పట్టిందా? ఎందుకలా అరిచావ్? అని కోపంగా అంటూ, నా భుజాలు పట్టుకుని ఊపేశాడు రవి. పాలిపోయిన నా మొహం చూసి, ‘రేయ్! ఎందుకేడుస్తున్నావ్? ఏమైనా మాట్లాడ్రా’… అని వణుకుతున్న గొంతుతో, ఉబికి వస్తున్న ఆందోళనను ఆపుకుని అడిగాడు. వాడి మొహం నాకు కనబడట్లేదు కానీ, నా ముందే నిలబడ్డట్టున్నట్టుగా ఉంది. ‘రవీ… నాకు సడన్ గా చూపు పోయిందిరా’ అని వినీ వినపడనట్టు అన్నాను. ‘నోర్ముయ్, నేనే దొరికాన్రా నీకు ప్రొద్దున్నే? నువ్వూ, నీ పిచ్చి జోకులూ’ అని చిరాకు పడ్డాడు.

‘అమ్మ తోడ్రా, నేను అబద్ధమాడట్లేదు. నిద్ర లేచిందెగ్గర్నుండీ నాకు కళ్ళు కనబడట్లెదు.’

‘ఎం మాట్లాడుతున్నావ్ రా? దేవుడా! ఏంటిది? వెంటనే బయల్దేరదాం పద డాక్టర్ దెగ్గరికి.’

నేను దేనికీ కొట్టుకోకుండా, జారి పడిపోకుండా, అడుగులో అడుగేస్కుంటూ, నన్ను ఇంటి గేట్ వరకు నడిపించుకెళ్ళాడు. నన్నక్కడే ఉంచి బైక్ తీసుకొచ్చాడు. అతి కష్టంమీద వెనక సీటుమీద చూర్చున్నాను. పడిపోతానేమోనని రవిగాడ్ని ఎంత గట్టిగా కరుచుకు కూర్చున్నానో. సూర్య కిరణాలు ఒంటికి వెచ్చగా తాకుతున్నాయి, బండి బాగా వేగంగా తోలుతున్నాడు వాడు, గాలి రయ్యి రయ్యిమని చప్పుడు చేస్తుంది. హాస్పిటల్ లాబీ లో నన్ను కూర్చుండబెట్టి, ఒక వీల్ చైర్ తీసుకొచ్చాడు. ‘ఒరేయ్, చైర్ నీట్ గానే ఉందా?’ అని అడిగితే, ‘నోర్మూసుకొని కూర్చోరా ఇడియట్’ అని కసిరాడు. ఇంకా ఏదో గొణిగాడు కానీ నాకు వినపడలేదు. ఎమర్జెన్సీ కేస్ అని అప్పటికప్పుడే నాలుగైదు గదుల్లోకి తీసుకెల్లి కావలసిన టెస్టులు జరిపించారు. ఇవన్నీ జరుగుతుండగా రవిగాడు నా పక్కన్నుండి కదల్లేదు. రిపోర్ట్స్ వొచ్చేదాకా రెస్ట్ తీసుకొమ్మని నన్ను బెడ్ మీద పడుకోబెట్టారు. ఆ రెండు గంటలు వేచిఉండడం రెండు యుగాల్లా అనిపించింది.

యే మూలనో చిన్న ఆశ బతికుందింకా నాలో, జరిగేదంతా ఒట్టి కల అని నన్నుఎవరైనా నిద్ర లేపుతారేమోనని ఆశగా ఉంది. కాసేపయ్యాక డాక్టర్ గారు రానే వచ్చారు. ‘ఐ యాం సొ సారీ! మీకు చూపు మోత్తంగా పోయింది. ఇది ఆప్టిక్ న్యూరైటిస్ అనే అరుదైన వ్యాధి. ఇది యే వయసులో వారికైనా రావొచ్చు కానీ, ఈ వ్యాధికి కారణాలు ఇవీ అని మేము ఖచ్చితంగా చెప్పలేము. మీకు ఈ జీవితంలో చూపు రావడం సాధ్యం కాకపోవచ్చు’ అని మూడు ముక్కల్లో సూటిగా చెప్పేసారు డాక్టర్ గారు. నా భయాలన్నీ ఒక్కసారే నిజమైపోయాయి. కడుపులో తిప్పేస్తోంది. ఇనప చేతులతో ఎవరో నా గుండెని చిదిమేసినట్టనిపించింది. ‘అంటే! ఇక నా జీవితంలో కెమెరా ముట్టుకోలేను, ఇంకొక ఫొటోగ్రాఫ్ చేయలేను’. కావ్య గుర్తొచ్చింది. ఆమె ఒళ్లో పడుకుని గట్టి గట్టిగా ఏడవాలనిపించింది. ఈ రోజు సాయంత్రం మీ అమ్మానాన్నలను కలిసి, మన పెళ్లి విషయం మాట్లాడతానని కావ్యకు మాటిచ్చాను. నన్ను ఈ పరిస్థితిలో చూసి, వాళ్ళు మా పెళ్ళికి వోకే అంటారా? అసలు, కావ్య నన్ను ఈవిధంగా ఒప్పుకుంటుందా? భవిష్యత్తు గురించి ఎన్నెన్ని కలలుగన్నాం, ఎక్కడెక్కడికి వెళ్దామనుకున్నాం? హే భగవాన్! కోటికొక్కనికి వచ్చే వ్యాధి నాకెందుకిచ్చావ్? నన్నెందుకిలా దురదృష్టవంతున్ని చేశావ్? ఇప్పుడెలా? తనను చూడకుండా నేనెట్లా బతికేది? ‘రవీ, కావ్యకు ఫోన్ చెయ్’ అంటూనే, బుర్ర గిర్రున తిరిగి మూర్ఛపోయాను.

రోజులు వారాలైనాయి, వారాలు నెలలైనాయి. హాస్పిటల్ నుండి ఇంటికొచ్చినప్పటి నుండీ, గడప బయట కాలు పెట్టలేదు నేను. ఈ వయసులో, అమ్మానాన్నలు నన్ను ఈ స్థితిలో చూడాల్సోస్తున్దనుకోలేదు. రిటైర్ అయి, హాయిగా కాలు మీద కాలు వేసుకునే టైములో, వాల్లకెన్ని బాధలు తెచ్చిపెట్టాను? రాత్రికీ పగలుకీ తేడా తెలియలేదు నాకు. నాకెవర్తోనూ మాట్లాడాలనిపించేది కాదు. నా రూంలో ఒక మూలన కూర్చునేవాన్ని. ఏడవడానికి కన్నీరు కూడా రావట్లేదింక. ఎంతమంది ఎన్నిరకాలుగా నన్ను సముదాయించాలని ప్రయత్నించినా నాలో చలనం లేదు. స్వంతగా ఒక పనీ చేసుకోలేను, ప్రతి దానికీ ఇంకొకరిమీద ఆధారపడకుండా రోజు గడవదు. ఆఖరికి బాత్రూం వెళ్ళాలన్నా, ఎవరో ఒకరుండాలి. ఎక్కడలేని కోపం… నా మీద, ఆ దేవుడి మీద, ఈ ప్రపంచం మీద. థూ… నా బ్రతుకూ ఓ బ్రతుకేనా? రావొద్దని లక్ష సార్లు చెప్పినా, రవి గాడు తీరిక దొరికినప్పుడల్లా వస్తుంటాడు. తిట్టినా ఒస్తున్నాడు, వెధవ. ఆఫీస్ లో పని పూర్తి చేస్కొని, కావ్య నన్ను కలవడానికి రోజూ సాయంత్రం రావడం, తాను ఎంత పిలచినా నేను నా రూమ్ బయటకి రాకపోవడం జరుగుతూనే ఉంది. అయినా ఒస్తోంది, డోర్ అవతల కూర్చుని యేవో నాలుగు ముచట్లు చెప్పి, నన్ను నవ్వించాలని ప్రయత్నిస్తోంది. కావ్య చాలా మొండిది, అయినా ఏదో ఒకరోజు ఓపిక నశిస్తుంది, ఇంటికి రావడం మానేస్తుంది… ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. ‘నా జీవితం ఎట్లాగూ నాశనమయ్యింది, నాతో ఉంటె తననూ పాతాళానికి లాక్కెలతాను. వేరే పెళ్లి చేస్కుని తను సుఖంగా ఉండడమే నాక్కావాలి’. నిజంగానా? తనను విడిచి నేనుండగలనా? ఉండలేకపోతే? తనే నన్ను ఒదిలేసి వెల్లిపోవచ్చుగా? ఏం సాధిద్దామని ఆ మొండితనం? తన జీవితం చేతులారా పాడుచేసుకోవడం ఏం బాలేదు. నేనున్నంత కాలం ఇలాగే కొనసాగుతుందేమో? ఎంతాలోచించినా, నేనెందుకింకా బ్రతికుండాలో ఒక్క మంచి కారణం నాకు దొరకలేదు.

అకస్మాత్తుగా వినిపించిన మువ్వల సవ్వడి నన్నీ ఆలోచనలనుండి బయట పడేశాయి. డోర్ ఘడియ వేసేద్దామ్ అని లేచే లోపల, రూం లోకి వచ్చేసింది కావ్య. వస్తూ వస్తూనే, నా చెయ్యి గట్టిగా పట్టేసుకుంది.

‘పదరా, అలా బయటకెల్దాం… నిన్నో మంచి ప్లేస్ కు తీస్కెల్తాను.’

‘ముందు నా చేయి వదలి, ఈ రూం నుండి బయటకి కదులు.’

‘నో వే! ఈరోజు మనం బయటకెల్తున్నాం, అంతే. నువ్వు ఇంకేం మాట్లాడకు.’

‘ఏయ్! చెప్తే నీకర్థం కాదా? నాకెక్కడికీ రావాలని లేదు. ప్లీజ్, నన్నువిసిగించకుండా వెళ్ళిపో ఇక్కడ్నుండి.’

‘ఏంట్రా, కుక్కలాగా అరుస్తున్నావ్? నువ్వు మామూలుగా వినేటట్టు లేవు…’

నన్ను బర బరా రూమ్ నుండి లాక్కెళ్ళింది. ఎన్ని నెలలైంది తను ఇంత దెగ్గరగా ఉండి? నా చేయి పట్టుకుని తీసుకెల్తుంటే, నేను వదిలించుకోవాలని ప్రయత్నించడం… తాను ఇంకా గట్టిగా పట్టేసుకోవడం. ఏమో, తనతో బయటకు వెల్లాలని నాకూ కోరికగా ఉందేమో. మనసులోని నిజం చెప్పాలంటే, ఈ సమయం కోసం నేను ఎన్నాళ్ళనుండో రహస్యంగా ఎదురు చూస్తున్నాను. తను పక్కనుంటే, నాకు ఎక్కడలేని బలం. ఏదైనా సాధించొచ్చన్న తెగింపు ఒస్తై. తను నాతోనే ఉండాలని కోరుకోవడం కరెక్టేనా? నేను చేస్తున్నదెంత తప్పు? నా స్వార్థం కోసం తనకెందుకీ కష్టమని ఒద్దనిపిస్తుంది. నా మనసులోని ఆలోచలను కావ్య పసిగట్టినట్టుంది… ‘హలో! పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి, మూస్కొని కూర్చో’ అని నన్ను కార్లో కూర్చోబెట్టింది. మరో మాట మాట్లాడకుండా, నిశ్శబ్దంగా కూర్చున్నాను.

సిటీ పొలిమేరలు దాటామన్కుంటా, ట్రాఫిక్ శబ్దాలు చాలామటుకు తగ్గిపోయినై. కిటికీ అద్దం కిందకి దింపింది. చల్లటి గాలి వీస్తోంది. రేడియోలో మైమరపించే కంఠంతో యం.ఎస్. సుబ్బలక్ష్మి భజగోవిందం పాడుతుంటే, కావ్య గొంతు కలిపింది. తను అలా పాడడమంటే నాకు చాలా ఇష్టమని, తనకు బాగా తెలుసు. కావ్య గాత్రం ఈసారి మాత్రం ఇంతకుముందెన్నడూ లేనంత గొప్పగా అనిపించింది. చూపు లేనందుకు నా వినికిడి శక్తి పుంజుకుందేమో. వేళా విశేషం బాగున్నట్టుంది, రేడియోలో అన్నీ నాకిష్టమైన పాటలే ఒస్తున్నాయి. కావ్య కూడా, పాడుతూనే ఉంది. అలా ఎంతసేపు పాడిందో నాకు తెలియలేదు, గొంతు నొప్పెడుతుందేమోనని ఆపమన్నాను. మొండి పిల్ల కదా, ‘నో’ అని, ఇంకో పాటందుకుంది. తన స్వరం గద్గదమయినట్టు, ఏదో తేడాగా అనిపించింది… ‘పాడడం ఆపుతావా, నేను కార్లోంచి దూకేయనా’ అని బెదిరించాను. ఏమైందో ఏమో, ఒక్కసారిగా కావ్య గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తాను ఎప్పుడూ ఇలా ఏడవలేదు. నాకేం చెయ్యాలో, తనను ఎలా ఆపాలో నాకర్థంకాలేదు. ఇంతలా ఎడుస్తుందంటే, ఈ రోజు మేం కలిసుండే ఆఖరి రోజేమో నన్న భరించరాని సందేహం కలిగింది. నన్ను వదిలి వెళ్తుందని చెప్పెస్తుందేమో. మంచిదే కదా… ఆఖరకు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నిజంగానే వెల్లిపోతుందా తను?… ఎండగట్టుక పోయినయనుకున్న కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నై. రోడ్డు పక్కన ఎక్కడో కారు ఆపేసింది.

నిర్మానుష్యమయిన ప్రదేశమనుకుంటా, ఏమీ వినిపించట్లేదు, కావ్య వెక్కిళ్ళు తప్ప. కాసేపయ్యాక, తనను తాను సంభాళించుకుని ఇంకో పాట పాడతానని గొంతు సరిచేసుకుంది కావ్య. మతిపోయింది నాకు. ‘నన్ను వదిలేసి వెళ్ళకుండా, నీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నావ్. ఎడుస్తూ కూడా నాకోసం పాటలు పాడుతున్నావ్…ఎందుకు?’ అని అడిగేశాను. నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా… ‘ప్లీజ్, ప్లీజ్ ఇంకొక్క పాట పాడతాను’ అని బ్రతిమాలింది. ‘పిచ్చేమైనా ఎక్కిందా నీకు? ఇంకా ఎందుకు పాడతావ్ కావ్యా?’ అని గట్టిగా అరిచాను. ‘నేను పాడుతున్నంత సేపూ నీ మొహాన చిరునవ్వుందిరా పిచ్చోడా, ఒక సంవత్సరం కావస్తుంది నీ నవ్వు చూసి’ అని ఏడుస్తూ చెప్పింది. స్థానువునయిపోయాను. ఆమె నా మీద చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేకపోయాను. చూపులేని నాకు, ఆ మాటల్లో బ్రంహాండం దర్శనమయ్యింది. నా సంతోషం కోసం, తాను అంతగా పరితపించడం నన్ను కట్టిపడేసింది. ఇది వర్ణణాతీతం. నిన్నుఇంకేమీ అడగనురా భగవంతుడా… ఒకే ఒక్క సారి, తనను చూపించవా చెవిటి దేముడా అని మనసులో కోరుకున్నాను. చల్లని గాలి గట్టిగా వీస్తుంది… మేము ఎప్పుడూ వచ్చే కొండ పైన అనుకుంటా. కార్నుండి నన్ను కిందకి దింపి, నన్ను కొంచెం దూరం నడిపించింది. ‘ఎక్కడికోచ్చామో చెప్కో చూద్దాం’ అని చిన్న పిల్లలా అడిగింది. నేనేమీ మాట్లాడలేదు. ‘మనం కొండ చివర నిలబడ్డామని’ మెల్లిగా చెప్పి నన్ను దెగ్గరతీసుకుంది. మాకు చాలా ఇష్టమైన ప్రదేశాల్లో ఈ కొండ చివర ఒకటి. మా స్నేహం మొదలయినప్పటినుండీ, వారానికి ఒకసారైనా ఇక్కడికి వచ్చెవాళ్ళం. ఇంత అందమైన ప్రదేశం కదా, ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడికెందుకొస్తారోనని మేము అనుకుని బాధపడే వాళ్ళం. మరి, కావ్య నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందంటే…? అలసిపోయిన మనసు కదా, అన్నింటికీ సిద్ధమయ్యింది.

‘కావ్యా, నిన్నొక్కసారి చూడగలిగితే బావుండు’ అని మనస్ఫూర్తిగా అన్నాన్నేను.

‘ఎందుకు బాధ పడతావ్ రా? ఎట్ లీస్ట్, నిన్ను నేను చూడగలుగుతున్నాను. ఒక్క మాట గుర్తుపెట్టుకో… నువ్వు చూపు మాత్రమే కోల్పోయావ్ కానీ, దృష్టిని కాదు. ఇదిగో, నీ కెమెరా తెచ్చాను… జాగ్రత్తగా పట్టుకో. ఎప్పుడూ నీ పక్కనే ఉంటా… మనసుని లగ్నం చెయ్, నీ హృదయంతో స్పందించు, పోయిన చూపుతో… వొచ్చిన దృష్టితో ఈ ప్రపంచాన్నిసరికొత్తగా చూడు’ అని అందంగా, ఆప్యాయంగా అన్నది. కెమెరాను, కావ్యను గుండెలకు హత్తుకున్నాను.


 (చూడడానికి కళ్ళు మాత్రమే చాలనుకున్న నాకు, నిజమైన దృష్టి విలువను నేర్పిన ‘నేత్ర విద్యాలయం’ పిల్లలకు, ఉపాధ్యాయులకు)


Copyright © All rights reserved.
Using Format