Art (in Telugu)

కళ, కల, కల్ల


జూబిలీ హిల్స్ ఏరియాలున్న అపోలో యాంఫీ థియేటర్ల, ‘ఇండీ మిక్స్’(indie mix) అనేటోల్లు మూడ్రోజుల కల్చరల్ ప్రోగ్రాం పెట్టిన్రు. అన్నా! మేము శానామంది కళాకారులను పిలుస్తున్నాం, మీరు గూడా రావాలే, ఫోటోగ్రఫీ కళ గురించి నాలుగు మాటలు మాట్లాడాలే అని పిలిషిన్రు. మంచి పని చేస్తున్నారు తమ్మీ, నేనుభీ తప్పక నావంతు పనిజేస్త అని మాటిచ్చిన. ఇయ్యాల్రేపు కళల మీద శ్రద్ధతోని పన్జెశెటోళ్ళు కరువయిపోయిన్రనుకున్న, కానీ, ఇసుంటోల్లు ఇంకా బతికున్నర్లె అని సంతోషపడ్డ. సంగీతం, నృత్యం, కవిత్వం, హాస్యం ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయంట, మీరుగుడ్క రాండ్రి అని మా భార్యను, పిలగాన్ని యెంట తీస్కబోయిన. నువ్వు ఫోటోగ్రఫి గురించి మాట్లాడుతున్నావ్ గదరా, మేమ్ భీ వస్తమని ఇద్దరు ముగ్గురు దోస్తుగాల్లు ఫోన్జేసి చెప్పిన్రు, వొచ్చిన్రు. ఇచ్చిన మాటమీద, రెండు గంటల ముందే పోయినమ్. ‘వెల్కమ్ టు ఇండీ మిక్స్’ అని బయట పెద్ద పోస్టరు, లైట్లు, డెకరేషన్లు, ఫుల్లు హంగామ. మెయిన్ గేట్ నుంచి స్టేజీ దాంక, దారి పొడుగునా రక రకాల స్టాల్స్ ఉన్నాయ్. పెయింటింగ్స్, చేత్తో నేశిన బట్టలు, హాండ్ మేడ్ సబ్బులు, కొన్ని కాళాకృతులు, రెండు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయ్.


రండ్రి సార్, మీ ప్రోగ్రాం రాత్రి ఎడుమ్బావుకు కావలిసి ఉండే, సారీ, అనుకున్న టైం కంటే ప్రోగ్రామ్స్ కొంచెం లేట్ నడుస్తున్నాయి, ఏమీ అనుకోవద్దు. అప్పటిదాంక ఈడ కూసొండ్రని నిర్వాహకులు మమ్మల్ని గాద్దెలమీద కూకోవెట్టిన్రు. యాంఫీ థియేటర్ అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ అన్నట్టు. పెద్ద పెద్ద చెట్ల కింద, స్టేజి వున్నది… దాని సుట్టు గుండ్రంగా కూసోనికి గద్దెలు కట్టిన్రు. వేడికి వుక్కబోసుడు తప్పించి, మస్తు మంచిగున్నది జాగ. నేను చుట్టూ చూశిన… స్టేజిమీద ఇద్దరు అక్కలు మలహర్ రాగం కురిపిస్తున్నరు, ప్రేక్షకులు పదిహేను ఇరవై కంటే ఎక్కువ ఉండరు. ఆ! సరేతీ, ఇంత తక్వమంది అయితేంది? ఇంట్రెస్టు తీస్కోని ఎడికేడికెల్లో వొచిన్రు… మనం చేశే ప్రోగ్రాం మంచిగ చెయ్యాలెనని అనుకున్న.


కానీ, పోయిన కాడికెంచి నా గుండెల్ల ఏందో గడబిడ కొడ్తుంది. అస్సలు మనసనపడ్తలేదు… నిజం చెప్పాల్నంటే, ఈడికి రాకపోతే బాగుండు అనిపిస్తుండే. అరె ఛల్! ఎప్పుడులేంది, గిదేందిరా భై? వందలమంది ముందు గంటలు గంటలు మాట్లాడినవ్, గిక్కడ టెన్షన్ పడ్తావ్? అని నన్ను నేను ప్రశ్నించుకున్న. ఏమి మాట్లాడాలె, యెట్లా మాట్లాడాలె అని నేనాలోచిస్తలేను… మరి ఎమయ్యుంటది?


వొచ్చినకాంచి, నా మదిల శ్రీ శ్రీ రాసిన పదాలు గిర్రు గిర్రున తిరుగుతనే వుండే… “మనదీ ఒక బ్రతుకేనా కుక్కల వలె, నక్కల వలె, మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె, నిజం సుమీ, నిజం సుమీ, నీవన్నది నిజం సుమీ”. వోయమ్మా! ఇంకో గంటయితే ఫోటోగ్రఫీ గురించి మాట్లాడేది ఉంది… అవ్వి గుర్తు చేస్కోకుండా… ఇదేంది… ఈ కవిత ఇట్లా గుర్తుకొస్తుందని బగ్గ భయమయ్యింది.


ఇప్పుడే వొస్త పిల్లా, అని మా ఆమెకు చెప్పి… బయట ఛాయ్ తచ్చుకున్దామని పొయిన. రాత్రి పదిన్నరకు సంగీతం ప్రోగ్రాం ఉన్నదట… దాని గురించి పబ్లిక్ మాట్లాడుకుంటుండే. ఛాయ్ కొన్కొని, గేటు కాడున్న ‘వెల్కమ్ టు ఇండీ మిక్స్’ అని సుస్వాగతం చెప్తున్న ఆ పెద్ద పోస్టర్ కాడికి పోయిన. టైటిల్ కింద రాశి ఉన్న మూడు పదాల మీద నా దృష్టి పడ్డది. అవునుకదా! నేను గేటు లోపటికి ఒస్తున్నప్పుడే ఈ మూడు పదాలు చదివినుండె… అప్పట్నుండే నాకు మనసనపడ్తలేకుండేనని జ్ఞ్యాపకమయ్యింది. మళ్ళా మళ్ళా శ్రీ శ్రీ మాటలు ఎందుకు గుర్తుకోస్తున్నాయో తెలిసింది. అప్పటిదాంక ఆందోళనపడ్డ నా మనసు ఒక్కసారి నిలిచిపోయింది. అక్కడ ఇంగ్లీషులో రాసి ఉన్న ఆ మూడు పదాలు… ‘Shop, Eat, Art’… కొనుక్కోండి, తినండి, కళలను ఆస్వాదించండి అని దాని ఉద్దేశ్యం. ‘Art’ అన్న పదం, ఆఖర్ల ఉన్నది.


ఛాయ్ కప్పు చెత్త బుట్టల పడేశి, అడుగుల అడుగేస్కుంట మావోల్ల దెగ్గరికి పొయ్యి కూసున్న. భరతనాట్యం ప్రోగ్రాం స్టార్ట్ అయింతుందని నిర్వాహకులు చెప్పీ చెప్పనట్టు అనౌన్సు చేసిన్రు. ఇట్లకాదని, ప్రేక్షకులకు మంచిగ అర్థం కావలెనని నాట్యం జేయబోయ్యే కళాకారిణి విషయం ఇంకోసారి అనౌన్సు చేసింది. నేను మళ్ళా చుట్టూ చూశిన… ఈసారి కళ్ళు తెరచి చూశిన. అంతా కొత్తగ, వేరేలెక్క కనబడుతుండే. ఈ ‘కళా’ నిర్వాహకుల ముఖ్య ఉద్దేశం నాకు అప్పుడప్పుడే అర్థమైతుండె.


ప్రేక్షకుల సంఖ్య మెల్లిగా పెరుగుతున్నది… ఒస్తా పోతా ఉన్నరు. నిర్వాహకుడు ఒకడొచ్చి, సార్ ఇప్పుడు కవితల ప్రోగ్రాం, ఇది కాంగనే మీది అని చెప్పిపొయిండు. హిందీ కవితా పాటం శురు అయ్యింది. రెండు వాఖ్యాలు తప్పులు లేకుండా చదువుతలేరు. హిందీ కవితలు శాన కష్టంగా అర్థమైతున్నై, వోపిక నశిస్తున్నది అందరికి, ఎవరికి వాళ్ళు గుసగుసలు పెడుతున్నరు. కవితలు చదివేటోళ్ళు ఇవన్ని పట్టించుకుంటలే. రిహార్సల్ కూడా దీనికంటే మంచిగ చేస్తరు వారీ అని నేను నా దోస్తులు అనుకున్నాం. ఇరవై నిమిషాలల్ల పూర్తి కావలసింది గంటంబావు గుంజిన్రు.


రాత్రి తొమ్మిదిన్నర దాటింది. ఒక నిర్వాహకుడు మళ్ళా నాకాడికొచ్చిండు. సార్! ఒక చిన్న ప్రాబ్లం ఒచ్చింది అన్నడు. మల్లెమయ్యిందిరా బాబు అనడిగిన. సార్! రాత్రి పదిన్నరకు రావాల్సిన సంగీతం ప్రోగ్రాంవాళ్ళు ఇప్పుడే ఒచ్చెశిన్రు… ప్రోగ్రాం ఇప్పుడే చేస్తారట… ఇది అయినంక బయట ఇంకేడికో పోతారట. మీరు ఈ సంగీతం ప్రోగ్రాం అయినంక మాట్లాడతారా? అని అడిగిండు. ఇది చాలా తప్పు బాబూ… నాది కొంచెం సీరియస్ టాపిక్ అన్న సంగతి మీకు ముందే తెలుసు, ఎడుమ్బావుకు కావలిసిన ప్రోగ్రాం రాత్రి పదిన్నరకు మారిస్తే, ఆ ఉన్న నలుగురు ప్రేక్షకులు కూడా నిద్రపోతరు. మీరు మీ సంగీతం ప్రోగ్రాం చేస్కొండి, నేను నా ప్రోగ్రాం క్యాన్సెల్ చేస్కుంట అని చెప్పిన. వాడు బాధ నటించి, ఒకే సార్ వీ ఆర్ సారి అని చెప్పేశి జారుకున్నడు. మేము మా దోస్తులు ఒకరి మోకాలు ఒకరు సూస్కోని, బయటకు అడుగులేషినం.


బయట స్టాల్స్ దెగ్గర నిలబడి మాట్లాడుకుంటున్నాం. సంగీతం ప్రోగ్రాం స్టార్ట్ అయినట్టుంది. ప్రేక్షకుల చప్పట్లు కూడా వినబడ్తున్నై, ఒకట్రెండు విజిల్స్ కూడా వినబడ్డై. మొదటి పాట లౌడ్ స్పీకర్ల వినబడుతుంది… “వొ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే”… వార్నీ! గొప్ప వాద్యకారులు ఒస్తున్నారంటే ఒరిజినల్ మ్యూజిక్ పాడ్తరనుకున్న. కళలు, కళాకారుల పేరు ఉపయోగించి ఆ నిర్వాహకులు హిట్ సినిమా పాటలు వినిపిస్తున్నరా? ఈ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ కోసమా ప్రేక్షకులు ఇంతగా ఎదురు చూశింది? ఎంత దగా చేశిండ్రురా! కళల పేరుజెప్పి టికెట్టుకు 200 వసూలు జేషి, దుకాణం నడుపుతుర్రుగదరా కొడుకుల్లారా… అనుకున్న. ఈ నిర్వాహకుల కోసమా నేను అంతగా శ్రమించింది? ఈ ప్రేక్షకుల కోసమా నేను అంతగా పరితపించింది?


ఆ మూడు పదాలు ‘Shop, Eat, Art’ మళ్ళీ కనబడ్డై. శ్రీ శ్రీ మాటలు మళ్ళీ వినబడ్డై…

“మనదీ ఒక బ్రతుకేనా కుక్కల వలె, నక్కల వలె,
మనదీ ఒక బ్రతుకేనా సందులలో పందుల వలె,
నిజం సుమీ, నిజం సుమీ, నీవన్నది నిజం సుమీ”

Copyright © All rights reserved.
Using Format