Great Result (in Telugu)

గొప్ప ఫలితం


అనగనగనగా గోప్పాపురం అనే పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని గురివింద మహారాజు
పరిపాలిస్తుండేవాడు. చుట్టుపక్కలున్న రాజ్యాలన్నింటిలో గోప్పాపురానికే గొప్ప పేరు.
ఎందుకంటే, ఆ రాజ్యంలో ఉన్న ప్రతీ ఒక్కరి జీవిత లక్ష్యం ‘నేను గొప్ప’ అనిపించుకోవడమే.
అందుకోసం వారంతా రాత్రనకా పగలనకా ఎంతో కష్టపడి పనిచేసేవాళ్ళు. ఆ రాజ్య వైభవం
ఇంతా అంతా కాదు… గొప్ప పనులు ఎలా చెయ్యాలో, అతి గొప్ప పనులు ఎలా చక్కబెట్టాలో,
పరమ గొప్ప పేరెలా తేచ్చేసుకోవాలో నేర్పించడానికి ఆ రాజ్యంలో ఎన్నో స్కూల్స్, కాలేజీలు,
యూనివర్సిటీలు కూడా ఉండేవి. చదువయ్యింతరవాత ఉద్యోగాలు చేసుకోడానికి ఎన్నో
గొప్ప కంపెనీలు, పరిశ్రమలు ఉండేవి. ఆ బిల్డింగుల సొగసులు, ఆ రోడ్లు, ఆ కార్లు, అక్కడున్న
మనుషుల ఆ ఠీవీ, దర్జా దర్పం చూడముచ్చటగా ఉండేవి. ఆ రాజ్యంలో ఉండే పేపర్లు, టీవీ,
సినిమాలు కూడా ఎంతో గొప్ప వార్తలూ కార్యక్రమాలూ ప్రసారం చేసేవి. ఉండే ఇల్లు,
కట్టుకునే బట్ట, తినే తిండి, మాట్లాడే మాట, చేసే పనీ, అన్నీ గొప్పవే.


దేశాటన చేస్తున్న నేను, ఈ రాజ్యంలో అడుగు పెట్టాను. దీపావళి పండగనుకుంటా
ఆ రాజ్యమంతా ఒక వెలుగు వెలుగుతోంది, మిరుమిట్లు గొలుపుతున్న దీపకాన్తుల్లో
ధగ ధగలాడుతోంది. ఓ విశాలమైన బంగాళా ముందు ఒక పెద్దాయన కుర్చీలో కూర్చొని
ఉండడం చూసిన నేను, దెగ్గరగా వెళ్లి నమస్కరించాను. ఏమోయ్ పరదేశీలాగున్నావు
మా రాజ్యానికి కొత్తా? అని అడిగాడు. అవునండీ, దేశాటన చేస్తున్నాను… మీ రాజ్యం
గురించి చాలా విన్నాను, నా కళ్ళతో చూసి వెళదామని వచ్చానని బదులిచ్చాను.
‘ఆ! ఆ! పనీ గట్రా లేకుండా దేశాటన చేస్తున్నావ్, కుటుంబాన్ని ఎలా పోషిస్తావయా?
గొప్పవాడివి కాకుండా ఈ బైరాగి వేశాలేందుకు? ఎంత గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం
చేసేస్తున్నావ్!’ అని నిర్మొహమాటంగా అనేశాడు ఆ పెద్దమనిషి. ఇదేమిటీ! నా ముక్కూ
మొహం కూడా తెలియదీయనకు, పలకరించిన నన్నుపట్టుకుని ఎంత మాటలనేశాడు
అని మనసు చివుక్కుమన్నా, నా వంతు ప్రయత్నాలు నేను చేస్తున్నానండీ, నా మనసుకు
నచ్చిన పనీ, పదిమందికీ ఉపయోగపడే పనిచేయాలనీ, అందులో భాగంగానే నాలుగు
కొత్త విషయాలు నేర్చుకుందామని దేశాటన చేస్తున్నానండీ’ అని వినయంగా విన్నవించాను.
‘చెప్పోచావ్ లేవయ్యా, నీలాంటి వాళ్ళని నా జీవితంలో ఎంతమందిని చూసుంటా?
అసలు నీకు బాధ్యత అంటే ఏంటో తెలుసా? నీకసలు కమిట్మెంట్ లేదయా. అందుకే,
ఊరూరా తిరుగుతూ సమయం వృధా చేస్తున్నావ్.’ అని తీర్పు ఇచ్చేశాడా పెద్దాయన.
‘అయ్యా! నేనెందుకూ పనికిరానని నాకు జ్ఞ్యానోదయం ప్రసాదించే మీలాంటి మేధావులను
నేనూ చూసాను, కానీ నేను పనికిరావడానికి ఏమి చెయ్యాలో సరైన దారి చూపించే
మనిషినింకా కలవలేదు’ అని ఆపుకోలేక అనేశాను. ‘నీకంటే వయసులో నేనెంత
పెద్దవాన్నో తెలుసా? ఎంతమంది గొప్ప వాళ్ళు కావడానికి నాదెగ్గర ట్రెయినింగ్
తీస్కుంటారో తెలుసా? చూస్తున్నావా చుట్టూరా ఈ వైభోగాన్ని?
ఫలితాలు… గొప్ప ఫలితాలను తీసుకోస్తానయా! వీడికసలు బుర్రకెక్కడంలేదు లేదు,
చెప్పండయ్యా మీరైనా’… అంటూ చుట్టూ ఉన్న ఇంకో నలుగురిని పిలిచాడు.


‘గొప్ప గొప్ప పనులు చేసాము చేయిస్తున్నామంటున్నారూ, మీరు చేస్తున్న పనికి
పరిణామాలూ, పర్యావసానాలూ ఏమిటండీ? అని సూటిగా అడిగాను. ‘పరిణామాలూ,
పర్యావసానమూనా? హహహ! ఎవడిక్కావలయ్యా ఈ పరిణామాలూ, పంగనామాలూ?
మనిషికి కావలసిందీ, అత్యంత ముఖ్యమైనదీ ఫలితం మాత్రమే. గొప్ప ఫలితాలే మనిషిని
గొప్ప వాడిని చేస్తాయి, అదే జీవిత పరమార్థం. అసలు పరిణామాల గురించి
ఆలోచిన్చడానికి నువ్వెడవు? నీకెంత ధైర్యం? నిన్ను చూసినప్పటినుండీ
నాకనుమానంగానే ఉంది, నువ్వూ నీ వాలకం! నీ ప్రశ్నలూ వింటూ ఉంటే, మా
ప్రశాంతమైన జీవితాలను చెడగోట్టేందుకే వచ్చినట్టున్నావు… మా గొప్ప రాజ్యానికి
శత్రువురా నువ్వు’ అని నావంక కోపంగా చూస్తూ గట్టిగా అరిచాడు పెద్దాయన. ఆయన
అరుపుకు నా చుట్టూ గుండ్రంగా గుమిగూడారు జనం. నిప్పుల్లా మండుతున్న యెర్రని
కళ్ళతో, కలసికట్టుగా ఒక విడదీయరాని జట్టుగా ఒక్కక్క అడుగూ ముందుకు
వేస్తున్నారు. నా తలమీద గొప్ప దెబ్బ… అమ్మా! అని అరిచాను. నా ఒంటిమీద దెబ్బలు
పడుతూనే ఉన్నాయి. అంతా చీకట్లు కమ్ముకున్నట్టుగా అనిపించింది. ‘పర్యావసానం’
అన్న ఒక్క మాటకు ‘ఫలితం’ ఇదా అని దేవుణ్ణి తలచుకుని శక్తినంతా కూడగట్టుకుని
ముక్కుతూ మూలుగుతూ పరుగుతీసాను. చావుతప్పి కన్ను లోట్టపోయినట్టు ఆ
రాజ్యంనుండి తప్పించుకున్నాను.


దీపావళి రోజు మళ్ళీ చెడు మీద మంచి జయిన్చిందని వాళ్ళందరూ సంబరాలు
చేసుకున్నారట. ఈ నోటా, ఆ నోటా జరిగిన విషయం గురివింద మహారాజు చెవిన
పడిందట. తన పటాలంతో తానే స్వయంగా వచ్చి, ఆ పెద్దమనిషిని, ఆయనకు
సహకరించిన జనాన్నందరినీ గొప్పగా సన్మానించాడట. తమ గొప్పతనాన్ని ప్రశ్నించిన
పరదేశికి మంచి శిక్ష వేశారని అభినందించి, పర్యావసానం అనే పదాన్ని మరింకొకసారి
ఎవరూ వాడకుండా అన్ని పుస్తకాలనుంచీ, నిఘంటువులనించీ, తమ భాషా వాడుక
నుండీ తొలగించారట. ఇది బాగా అమలు కావడానికి ఒక చట్టం కూడా చేసారంట.
ఈ రోజు మన రాజ్యం గర్వించదగ్గ రోజని, ఇకముందు దీపావళిని మరింత గొప్పగా
జరపాలని చాటింపు వేయించారట.


కాలక్రమేనా ఆ పదం గురించి అందరూ మరచిపోయారు, రాజ్యం సుఖశాంతులతో వర్ధిల్లింది.
మనిషికి ఇక పరిణామాలూ, పర్యావసానలతో పనిలేదు. అందరూ గోప్పవారయిపోయారు.


‘లెటర్స్ టు ఎ స్ట్రేంజర్’ – సంతోష్ కొర్తివాడ 

Copyright © All rights reserved.
Using Format