Who? (in Telugu)

ఎవరు?


ఒక ఫొటో తీయడానికి వొక కెమెరా, ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే చాలు అని మనందరికీ తెలిసిన విషయమే.
కానీ, ఒక ఫొటో తీయడం వెనక ఎంత శ్రమ ఉంటుందో, ఎంతమంది శ్రమజీవుల కష్టం ఉంటుందో మనం
ఊహించడానికి అంత సులువు కాదు.


ఒక కెమెరా తయారు చేయడంలో సుమారు పదహారు దేశాలలో వందలకొద్దీ శ్రామికులు తయారు
చేసిన పార్ట్స్ వాడతారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రకరకాల యంత్రాలు ఖచ్చితమైన క్వాలిటీ టెస్టింగ్
చేస్తే తప్ప ఒక మంచి కెమెరా మనముందుకు రాలేదు. ఒకడు మంచి ఫోటోగ్రాఫర్ కావడం కోసం ఎంతో
మంది సహాయ సహకారాలతో నేర్చుకున్న విద్య, ఎన్నో ఘడియల నిర్విరామ కృషి, ఎవరో ఎక్కడో చేసిన
సాఫ్ట్వేర్, హార్డువేర్లలో నైపుణ్యం చాలా అవసరం. రాత్రనకా పగలనకా తన శక్తి యుక్తులనంతా ధారపోసి,
ఒక క్రియేటివ్ కాన్సెప్ట్ ఆలోచించుకొని ఇంకొన్ని వందలమందితో పనిచేస్తాడు, పనిచేయిస్తాడు.
ఇదంతా విన్నాక, ఒక ఫోటో తీయడానికి కొన్ని వందలమంది పనిచెయ్యాల్సోస్తుందన్న మాట మనకు
కరెక్టే అనిపిస్తూంది.


‘ఎవడి పని వాడు చేసాడండీ! మనం కష్టపడి సంపాదించిన డబ్బు ఇచ్చి ఆ వస్తువు కొనుక్కున్నాం,
అంతే, ఆ వస్తువు మనది, మనమే దాని ఓనర్’ అని పొగరుగా అనేస్తాం. మన ఇల్లు కట్టడానికి ఎంతమంది
పనిచేసుంటారు? మనం రోజూ తినే తిండి పండించడానికి ఎంతమంది? మనం కట్టుకునే బట్ట, వేసుకునే
చెప్పు ఎవరు చేస్తున్నారు? ఎవడేమ్ చేస్తే మనకెందుకు? మన బియ్యం ఎవడు పండించాడు?
నీళ్ళు బాటిల్ లో ఎవడు నింపాడు? బట్టలు ఎవరు ఇస్త్రీ చేసారు? మనం తిరిగే కార్లు ఎవరు మలిచారు?
ఇవన్నీ ఆలోచించే టైం లేదు. దురదృష్టవశాత్తూ, మనకవసరమైనవన్నీ మనకెవరు చేసిపెడుతున్నారో
మనకు తెలియదు. తెలుసుకుందామన్న తాపత్రేయం మనకు లేదనే చెప్పుకోవాలి. ఇంతమంది ఇన్ని
రకాలుగా మనకు తెలియకుండా పనిచేస్తే తప్ప, మనం దేన్నీ అనుభవించలేము కదా? ఇది ‘నాది మాత్రమే’
అని నేను ఎలా అనగలుగుతాను?


నేను తీసిన ఫోటోకి నేను మాత్రమే ఓనర్ అని మనమెలా బండగుద్ది చెప్తున్నమో నాకైతే అర్థంకాదు.
లీగల్ గా అది కరెక్ట్ కావచ్చు, కానీ మోరల్ గా అది ఎంతమాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం.
ఒక ఫోటో తీయడానికైనా, ఓక జీవితం గడవడానికైనా మనం ఎంతమందికి కృతజ్ఞతలు చెప్పుకోవలసి
ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. మనం ఈరోజు ఇలా ఉండటానికి తోడ్పడిన ఆ ఊరు పేరు లేని
అజ్ఞాత శ్రామికులనందర్నీ ఒక్కసారి స్మరించువడానికైనా మనకు టైం ఉందని ఆశిస్తూ…


‘లెటర్స్ టు ఎ స్ట్రేంజర్’ బై సంతోష్ కొర్తివాడ

5/1/2018