Black & White (In Telugu)

“నలుపూ తెలుపూ”


“ఏంది పప్పా? నీకు కలర్స్ అస్సలు నచ్చయా? నువ్వెప్పుడూ ఈ బ్లాక్ & వైట్ పిక్చర్స్
తీస్తుంటవ్!” అని పరమ చికాకు మోకమేస్కోని అడిగిండు నా తొమ్మిదేళ్ళ కొడుకు.
మావోనికి చెప్పుడు సంగతి పక్కకు పెడితే, అస్సలు నాకు తెల్సా ఈ బ్లాక్ & వైట్ పిక్చర్స్
అంటే నాకేందుకంత ఇష్టమని? అరె! చిన్నప్పటిసంది గిదే కథ. రంగులంటే పెద్దగ
పట్టించుకోలే. చిన్నప్పుడు తెలుపంటే ఇష్టం, ఇప్పుడు నలుపంటే ఇష్టం. ఏడికేంచి పుడ్తదిభై
ఈ ఇష్టం? అసలు యేందీ బ్లాక్ & వైట్?


సైన్సు చెప్పినట్టు, తెలుపు నుంచే అన్ని రంగులూ పుడ్తయంట, అన్ని రంగులూ కలిస్తే
నలుపు తయారైతదంట. అంటే, తెలుపు మనకు రంగులనిస్తే, నలుపు మన దేగ్గరికేంచి
రంగులను తీస్కుంటది. పుట్టుక, చావు గురించి చెప్పినట్టే ఉన్నది కదా! ఈ ఇష్టా
అయిష్టాలు, జ్ఞాన అజ్ఞానాలూ, కోప తాపాలన్నీ మనంనమ్మే జీవన సిద్ధాంతం నుండి
పుడతాయని నాకనిపిస్తుంది. మరి మన జీవన సిద్ధాంతం ఎక్కడ పుడ్తది? అన్న ప్రశ్నలోనే
జవాబు ఉన్నది కదా! జీవన సిద్ధాంతం మన జీవితం నుంచే పుడ్తది. కానీ, కాలంతో
మార్తనే ఉంటది, పుట్టి పెద్దగైతది, పెద్దగై ముస్సల్దైతది, ఆఖిరికి మన సిద్ధాంతం
మనతోనే సస్తది. ఏమో మళ్ళా పుడ్తదేమో!


“చిమ్మని చీకట్లను ఎడమ కంటిలో, చల్లని వెలుతుర్లను కుడి కంట్లో దాచుకుని…
ఆ రెంటినీ కలుపుకుంటా అల్లిన కాలాన్ని భగ్గున ముక్కంటితో ఒట్టి బూడిద చేశి
తన వొంటికా పెద్దభిక్షగాడు పూసుకుంటే, వాణ్ని తల్చుకొని… ఆ తెల్లని ఊహలకూ
నల్లని భావాలకూ పుట్టిన పవిత్రమైన బూడిద చిత్రాలను అలంకారం జేసుకున్నడీ
కొత్త బిచ్చగాడు. నలుపూ తెలుపులు వేరు కాదు, నలుపే తెలుపైతది తెలుపే నలుపైతది,
అందులోనుంచే మిగితా రంగులు పుడతై, మళ్ళా అందులోకే కలిసిపోతై. వాటినుండే
పుట్టిన మనమూ ఏదోరోజు బూడిద కావలసిందే. అందుకే నాకు బ్లాక్ & వైట్ ఫోటోగ్రఫి
అంటే ఇష్టం నాన్నా” అని నా కొడుకుకు చెప్పిన. “నిన్ను ఇంకోసారి ఏమీ అడగను పప్పా!”
అని మూతి ముడుసుకొని ఉర్రికిపోయిండు వాడు.


‘లెటర్స్ టు ఎ స్ట్రేంజర్’ బై సంతోష్ కొర్తివాడ, 4/27/2018 

Copyright © All rights reserved.
Using Format