Selfie

సెల్ఫీ

ఈ శతాబ్దానికే ఒక తిరుగులేని అర్థాన్ని చేకూర్చిన దృగ్విషయం ‘సెల్ఫీ’ అంటే అతిశయోక్తి కాదు.
దీన్ని అవసరం అని కొందరు, ఒట్టి దండగ అని కొందరు, ఇది వ్యసనం అని కొందరు, మరి
ఇంకొందరైతే ఏకంగా సెల్ఫీ ఒక అంటువ్యాధి అని వాపోతుంటారు. మన కుర్రకారు మాత్రం
సెల్ఫీ ని ‘భావ వ్యక్తీకరణ’ అని చాటి చెప్పేస్తూంది. కుర్రకారేం ఖర్మ, పిల్లకారు, పడుచుకారు,
మధ్యవయస్కారు, ముసలికారు, ఆఖరికి అస్థిపంజరకారూ, ఈ సెల్ఫీ మోజులో పడిపోయారూ
ఇంకా పడిపోతూనే ఉన్నాం మరి.


కొంతమంది మనస్తత్వ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం, ఈ సెల్ఫీ మోజుకి మూలకారణం
మన ‘నార్సిసిజం’ అంట. ఈ నార్సిసిజం గురించి మీకో కథ చెప్పాలి… గ్రీకు మైథాలజీలో,
అనగనగనగా నార్సిస్సస్ అనే వేటగాడు ఉండేవాడట. వాడు యమా అందగాడంట,
అందమంటే మామూలు అందం కాదు, ఊరు ఊరంతా మంత్రముగ్ధులు అయ్యేంత అందమట.
వీడి శరీరాకర్షణ పుణ్యమాఅని చుట్టూ ఉన్నవాళ్ళంతా దాసోహం అంటా, వీడు ఏదంటే అది
ఎంతంటే అంత. అందంగా ఉంటానని తెలుసు కానీ, అసలు ఎంత అందంగా ఉంటాడో
నార్సిస్సస్ కి తెలియదు. అప్పట్లో రూపురేఖలు చూసుకుని మురిసిపొయ్యేందుకు ఇంట్లో
అద్దాలు లేవు కదా, ఒక రోజు వేటకు వెళ్లిన రోజు, నీటి కొలనులో తన ప్రతిబింబాన్ని
చూసుకున్నాడట. అంతే! తన అందాన్ని తానే చూపుతిప్పుకోలేకుండా తదేకంగా చూసేస్తూ,
తనతో తానే ప్రేమలో పడ్డాట్ట. అది బింబమా ప్రతిబింబమా అన్న తేడా కూడా తెలియకుండా,
తనని తాను చూసుకోకుండా ఉండలేక, ఒక్కమారు కనురెప్పకూడా వెయ్యకుండా, తన ప్రేమ
తన్మయత్వంలో తానే మునిగిపోయి ప్రాణాలు వదిలేసాడంట. ఈ నార్సిస్సస్ కథనుంచే
నార్సిసిజం అన్న పదం పుట్టింది. డిక్షనరీ అర్థం ప్రకారం, నార్సిసిజం అంటే మన మీద మనకు,
ముఖ్యంగా మన రూపం మీద మనకు తీవ్రమైన అభిమానం.


అందంగా ఉండాలని, అందంగా కనబడాలని, నువ్వు అందంగా ఉన్నావంటూ నలుగురూ
అనాలని, కోరికగా ఉండడం సామాన్యంగా చిన్న పెద్ద, ఆడా మగా, మనం అనుకునే విషయమే.
ఏంచేస్తే అందంగా కనబడతాను? అనే విషయ పరిజ్ఞ్యానం బాగానే ఏడిసింది మనకు. వేసుకునే
బట్టలు ఎలా ఉండాలి, జుట్టుకి ఏ రంగేసుకోవాలి, మొహానికి ఏ పౌడరు దిద్దుకోవాలి, షర్ట్
వేసుకోవాలా టీషర్ట్ వేసుకోవాలా, మూతి ముడుచుకోవాలా, మామూలుగా ఉండాలా
లేక బుంగమూతి పెట్టాలా లేక వంకర మూతి పెట్టాలా, ఒకవేళ వంకర మూతి పెడితే చేతులు
ఎలా పెట్టాలి, ఎలా నిలబడాలి, మన వెనకాల ఏమి ఉండాలి, ముఖం నవ్వుతున్నట్టా
ఆలోచిస్తున్నట్టా కోపంగా ఉన్నట్టా కొంటెగా చూస్తున్నట్టా లేకుంటే ఆ బ్రహ్మదేవునికి కూడా
అర్థంకాని ఒక కొత్త ఎక్స్ప్రెషన్ కూడా బాగా ప్లాన్ చేసుకునిమరీ సెల్ఫీ క్లిక్ మనిపిస్తాం. మొహం
మీద మొటిమలూ, నల్ల మచ్చలూ, మరకలూ, వయసు పరంగా వచ్చిన ముడతలు కూడా
కనబడకుండా, చర్మం ధగ ధగ లాడిపొయ్యేలా, స్వర్గం నుండి సరాసరి భూమ్మీదకి దిగివచ్చిన
దేవీ దేవతల్లాగా మనం తీసుకున్న సెల్ఫీని పేపరు చిరిగిపోయ్యేంతగా రుద్ది రుద్ది ఒక పర్ఫెక్ట్ సెల్ఫీ
తయారుచేసే ఎన్నో సాఫ్ట్వేర్లు, ఎన్నెన్నో ఆప్ లు మనకిప్పుడు సెకండ్స్ లో ‘ఫ్రీ’ గా లభ్యం
అవుతున్నాయి. ఇంటర్నెట్ పుణ్యమాఅని పల్లె పల్లెలా ఊరూరా ఫేసుబుక్, ఇంస్టాగ్రామ్,
వాట్సాప్, స్నాప్ చాట్, మన్నూ మశానం. ఈ మశానం లో నేనూ ఒక ప్రేక్షకున్నేనండోయ్!
నాకూ ఓ ఫేస్ఉందీ దానికీ ఓ అందంఏడిసిందీ.


ఈ సెల్ఫీ దృగ్విషయానికొస్తే ఒక్క నార్సిసిజం మాత్రమే కారణం అనిపించట్లేదు నాకు.
నార్సిసిజానికి వ్యతిరేకి అయిన ‘ఆత్మ న్యూనతాభావం’ కూడా కావచ్చు. మొదటిది అతివృష్టి
అయితే రెండోది అనావృష్టి. న్యూనతాభావానికి లోనైఉన్నవాళ్లు అనుకునే విధానం ఏంటంటే…
నేనస్సలు అందంగా లేను, నాదస్సలు అందమే కాదు, నన్ను నలుగురూ అందంగా ఉన్నావంటూ
ఎప్పుడూ అనరుగాక అనరు, అందానికీ నాకూ సంబంధమే లేదు, నాకంటే ఈ ప్రపంచం లో
అందరూ అందగాళ్లే, అందగత్తెలే. కానీ, నేను నాలాగా కాకుండా ఆ హీరోలాగానో ఈ మోడల్
లాగానో కనబడితే చాలా బాగుంటుంది, అప్పుడు నలుగురూ నన్ను మెచ్చుకుంటారు అని
ఆలోచిస్తుంటారు. అయితే ఈ రెండు కోణాలూ అత్యంతమైనవి, మధ్యలో ఉన్న ఆలోచనా
దృక్పధాలు కూడా ఎన్నో ఉన్నాయ్.


నాకింకా గుర్తు, చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ సినిమా మా ఊర్లో ఆడేటప్పటికీ ఆ సినిమా రిలీజ్
అయ్యి ఓ ఆర్నెల్లయినా గడిచిపొయ్యుంటది. కానీ, ఆ సినిమాలో చిరంజీవి వేసుకున్న
మెరుపుల షర్ట్స్, బ్యాగీ పాంట్స్ మా ఊర్లోకి ఎప్పుడో ఒచ్చేసాయి. పండక్కి నాకు ఆ
మెరుపుల చొక్కా (డిస్కో షర్ట్ అనేవాణ్ణి), తెల్లటి బ్యాగీ ప్యాంటు కావాలని ఏడ్చి గీపెట్టి
సాధించుకొచ్చాను. క్లాత్ మార్చెంట్ దెగ్గర బట్ట తీసుకుని, మా ఆస్థాన దర్జీ దెగ్గర, ఇంకో రెండు
సంవత్సరాలక్కూడా సరిపొయ్యెలా కొలతలిచ్చి పండగకి ఒక రోజు ముందే రెడీ అయ్యేటట్టు
దర్జీతో మాటేయించుకున్నాను. ఆయన మాట నిలబెట్టుకున్నాడు కూడా. దసరా పండగనుకుంటా,
పిట్టను చూడడానికని నా స్నేహితులతో కలిసి ఊరు ఊరంతా కూడబలుక్కొని అడవులవెంటా
తిరిగేవాళ్ళం. ఒక్కసారి చుట్టూ చూసిన నాకు కళ్ళు తిరిగినంత పనయ్యింది. సగం ఊరంతా అవ్వే
మెరుపు చొక్కాలూ బ్యాగీ ప్యాంట్లు వేసుకుంది. కొంచెం కాలేజీ వయసున్న కుర్రాళ్ళయితే జుట్టు
కూడా చిరంజీవి లాగే పెంచేసుకుని కటింగ్ చేయించుకున్నారు. నాకు ఏడుపొక్కటే తక్కువ.
అక్కడ ఉన్నవాళ్ళంతా చిరంజీవులే అందరూ గ్యాంగ్ లీడర్లే, బట్ వితౌట్ విజయశాంతి.
గొర్రెల మందలో నేనూ ఒక గొఱ్ఱెనయిపోయాను అని బాగా బాధపడ్డాను. ఇంకా ఈ నా జన్మలో
మరోసారి ఈ తప్పు చెయ్యనని ఒట్టేసుకున్నాను. ప్చ్! అంత తొందరగా జ్ఞ్యానోదయం అయితే నేను
వివేకానందుణ్ని అవుతాను కాని నేనెందుకవుతాను? బాజీగర్ సినిమా లో షారుఖ్ ఖాన్ కళ్ళద్దాల
ఫ్రేము, దిల్ చాహతాహై సినిమాలో ఆమిర్ ఖాన్ హెయిర్ స్టైల్ నా కాలేజీ వయసులో ట్రై చేసాను.
ఆ టైంలోనే ఈ ఫేస్ బుక్ ఉండుంటేనా, నా సామి రంగ! నా సెల్ఫీలతో ఈ దేశాన్నంతా ఒక్క
ఊపు ఊపేశేవాన్ని. చిరంజీవి తరువాత నేనే! ఈ మహేష్ బాబులూ, రామ్ చరణ్ లూ,
బన్నీలూ చున్నీలూ వీరెవ్వరికీ నాముందు ఛాన్స్ దొరికేది కాదు.
‘మెగా రియల్ గుండె గుభేల్ స్టార్’ అని నాకు ఒక బిరుదు కూడా ఉండేది.
పోనీలే, ఇప్పుడు పాత విషయాలెందుకు. నేను ధోనీ లా అవుతాను అనుకోడానికీ,
నేను ధోనీ లా కనబడితే చాలు ధోనీ అయిపోనట్టే అనుకోడానికి ఉన్న వ్యత్యాసం
తెలుసుకోడానికి నాకు చాలా సంవత్సరాలే పట్టింది.


సెల్ఫీలూ, ఫోటోలు తీసుకోవడం తీయించుకోవడం మనకు కొత్తేమీ కాదు. ఫేమస్ ఆర్టిస్టులూ
ఫొటోగ్రాఫర్లూ ‘సెల్ఫ్ పోర్ట్రైట్స్’ చేసుకునే వాళ్ళు. లియోనార్డో డా వించి, రెంబ్రాంట్, క్లాడ్ మోనే,
విన్సన్ట్ వాన్గోగ్, పాబ్లో పికాసో వంటి పెయింటర్స్… మాన్ రే, వివియన్ మేయర్, రిచర్డ్ అవెడాన్,
సిండీ షెర్మాన్ లాంటి ఫొటోగ్రాఫర్లూ ఈ కోవకు చెందిన వారే. ఆ! ఆరిస్టులు చేస్తే సెల్ఫ్ పోర్ట్రైట్
అని గొప్పలు పోతారు, మరి మేము చేస్తే సెల్ఫీ అని తీసి పారేస్తారు అని మిడి మిడి జ్ఞ్యానంతో
వాదించే వాళ్ళూ లేకపోలేరు. చిన్నప్పుడు ఫోటో స్టూడియోస్ లో కటౌట్స్, చేత్తో చేసిన బ్యాగ్రౌండ్స్
ఉండేవి. తాజ్ మహల్, బెంగళూరు గార్డెన్, ఓపెన్ టాప్ కారు, అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్, ఏఎన్నార్,
శ్రీదేవి కటౌట్స్ తో సహా ఒక్కరేమిటి, మొత్తం కుటుంబమంతా కలిసి ఫోటో తీయించుకునే వీలుగా
ఉండేవి, కాకపోతే ఒక చిన్న తేడా… ఒక్క ఫోటో తీయించుకోవడానికి బాగానే కష్టపడేవాళ్ళం.


ఉత్తర ప్రత్యుత్తరాలు రాసేసుకుని, పండగకో పబ్బానికో ఒక్క చోట చేరి, మ్యాచింగ్ బట్టలు
కుట్టించుకుని, వారం రోజులముందునుండే ఇలా నిలబడదాం, అలా పోజు పెడదాం అనేసుకొని,
రక రకాల జ్ఞ్యాపకాల తెరలను మెల్లిగా జరిపేసుకుని, తనివితీరా నవ్వుకొని, ఒక తెలియని
ఉద్రిక్తతాఉత్సాహాల మధ్య నడుచుకుంటానో, బస్సెక్కో, రైలెక్కో స్టూడియోకి బయల్దేరేవాళ్ళం.
ఇంత కాదు అంత, మా ఫోటో బాగా తీస్తే మా ఊరినంతా నీ స్టూడియో కి పంపిస్తామని కల్లబొల్లి
కబుర్లు చెప్పి, సగానికి సగం డిస్కౌంటు ఇచ్చేదాకా ఫోటోగ్రాఫర్ తల తినేసి మరీ ‘ఒక్క’ ఫోటో
తీయించుకునేవాళ్ళం. ఇదంతా ఒక సరదాగా ఒక సంబరంగా జరిగేది. ఫోటో ప్రింట్ మన చేతిలో
పడేంతవరకు ఎంతో ఆదుర్దాగా ఎదురుచూడడం జరిగేది. ఆ రోజు రానే వచ్చాక, నెమ్మదిగా
లిఫాఫా ఓపెన్ చేసి కళ్ళు ఇంతింత చేస్కుని మళ్ళీ మళ్ళీ చూసేస్కుని, చూపించేసుకుని, ఫోటో
వెనకవైపు డేట్ అండ్ టైం చిన్నగా రాసుకొని, చాలా జాగ్రత్తగా మన ఫామిలీ ఆల్బం లో భద్రపర్చుకునే
వాళ్ళం. ఇలాగ, ప్రతీ ఆర్నెల్లకో సంవత్సరానికో ఇంకొక్క ఫోటో. మళ్ళా వచ్చే పండక్కి అందరూ
కలిసినప్పుడు ఆ ఆల్బమ్ ముందేసుకొని ఇకఇకలూ పకపకాలూ. గ్రూప్ ఫొటోలో ఎవడైనా ఖర్మకాలి
కళ్ళు మూసుకున్నాడో, వాడి పని ఫినిష్. మాకో కాపీ కావాలంటే మాకో కాపీ కావాలంటూ
మరోసారి ఆ ఫోటో స్టూడియోకి పరిగెత్తేవాళ్ళం. ఇదంతా ఒక ప్రయాస, ఒక వల్లమాలిన ప్రేమ.
పండగ సెలవులన్నా, చుట్టాల ఇంటికి ప్రయాణాలన్నా, సకుటుంబ సమేత భోజనాలన్నా,
అమ్మమ్మ చేతి ఆవకాయన్నా, తాతయ్య చేతి ఘడియారామన్నా, మామయ్య చూపించే సిన్మాలన్నా,
అత్తయ్య దొంగచాటుగా ఇచ్చే రూపాయన్నా, అందరం కలిసి కట్టుగా తీయించుకున్న ఒక ఫోటో అన్నా,
ఎనలేని ఎదురుచూపు. ఆ రోజులు పోయాయి, ఆ మనుషులు పోయారు. ఒకవేళ అల్లాంటి మనుషులూ,
కుటుంబాలూ ఇంకా ఉంటే మీకు నా అభినందనలు, చాలా జాగ్రత్తగా ఆ ప్రేమల్ని ఎల్లకాలమూ
కాపాడుకోవాలని విజ్ఞప్తి. ఇవ్వాల్టి రోజుల్లో నాకొక్క ఫామిలీ ఆల్బం కనబడితే ఒట్టు.
తీసుకునే ఫోటోలు వేలూ లక్షలూ, మళ్ళీ చూసుకునే టైం లేదు, జాగ్రత్తగా దాచుకుందామనే
ఆలోచనే లేదు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో తీసుకున్న ఫోటోలైనా ప్రింట్స్ వేసుకుందామని,
ఒక ఆల్బం చేసుకుందామనే ఆసక్తి అంతకన్నా లేదు. మా అంటే, ఒక పెళ్లి ఫోటో ఆల్బం ఒక పుట్టినరోజు
ఆల్బమ్… మిగితా జీవితమంతా ఒట్టి దండగ అన్నట్టు.


నార్సిసిజం అయితేనేమి, ఇంఫిరియారిటీ కాంప్లెక్స్ అయితేనేమి, ఇంకేదైనా గొప్ప కారణంగానేమి,
ఈ సెల్ఫీ పరిణామం ఒక ఫోటో అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. సోషల్ మీడియా ప్రపంచంలో
ఒక సెల్ఫీ అంటే నా ఉదేశ్యం లో ఒక ఫోటో కావచ్చు, ఒక రాజకీయ పార్టీ పైన కామెంట్ కావచ్చు,
నా తల్లిదండ్రులతో రంగస్థలం సినిమా ప్రసాద్స్ ఐమాక్స్ లో చూస్తున్నానని ఒక లొకేషన్ పిన్
కావచ్చు, నా బర్త్డే సందర్భంగా కేక్ కట్ చెయ్యకుండా ఒక అనాధాశ్రమానికి వెళ్లి పుస్తకాలూ
బట్టలూ ఇచ్చేస్తున్నానని డబ్బా కొట్టుకోవడం కావచ్చు, ఓయబ్బ! నాకు ఫోటోగ్రఫీ లో
ఇంటర్నేషనల్ అవార్డు ఒచ్చేసిందహో అని చాటింపు కావచ్చు, ఐ హేట్ మై వైఫ్ అని డైరెక్ట్ గ
కావొచ్చు, వెయిటింగ్ ఫర్ ఏ ఫ్రెండ్ (ఇన్ ఫ్రంట్ అఫ్ ఈఫిల్ టవర్) అని చెప్పీ చెప్పక చెప్పొచ్చు,
అసలు కొందరుంటారండీ… అని ఇండైరెక్ట్ గా స్టేటస్ అప్డేట్ పెట్టేసుకోవచ్చు, పబ్లిక్ గా అరిచే
విషయం కావచ్చు, మరీ వ్యక్తిగతమైన సమస్యే కావచ్చు… సోషల్ మీడియా వాడు చెప్పుకోడానికి
ఒక వేదిక ఇచ్చాడు, మనం విచ్చలవిడిగా చెప్పేసుకుందాం. ఎన్ని లైక్స్ ఉంటే అంత గొప్ప, ఎన్ని
కామెంట్స్ ఉంటే అంత ప్రతిష్ట. లైక్స్ రాకుంటే, కామెంట్స్ పడకుంటే ఆవేదన, మనస్తాపం,
ఇంకా ముదిరితే ఆత్మహత్య.


వీటంతటికీ ఒక్క సోషల్ మీడియాదే బాధ్యత అనుంటే అది తప్పు అని నా భావన. ఈ సబ్బు వాడితే
మీరు దీపికా అంత అందంగాఉంటారు, ఈ క్రీం మిమ్మల్ని వారం రోజుల్లో షారుఖ్ ని చేసేస్తుంది,
ఆ స్ప్రే వేసుకుంటే ఆడపిల్లలు చదువూ సంధ్యా ఇల్లూ వాకిలీ మొగుడూ పిల్లలను కూడా వదిలేసి
నీ వెంట పడతారు, గుండు సూది నుండి బ్రాందీ బోటిల్ దాకా, ఇటుకపెల్ల నుంచి ఇంద్రభవనం
దాకా మన హీరో హీరోయిన్లూ, క్రికెట్ మారాజులూ చెప్తేనే వింటాం.
ధామ్ ధూమ్, ధడేల్ ధనేల్, చెవులు తూట్లు పడేలా న్యూస్ అరిస్తేనే మనం వింటాం, చూస్తాం.
సినిమాల్లో హీరో ఒక వంద మందిని చితక్కొట్టి, హీరోయిన్ పిర్రలమీద డోలు వాయించేసి,
విలన్ బట్టలు చించేసి వాణ్ని కత్తితో ఖండాలుగా నరికితే తప్ప హీరో ఎట్టాగవుతాడుగానక.
ఇక మన టీవీ సీరియల్స్ గురించి మొదలుపెట్టే ఓపిక నాకు లేదు. సినిమా, మీడియా, బిజినెస్,
ఆఖరికి మన విద్యావిధానం కూడా ఈ తంతులో భాగమే. ఇదంతా ఒక ‘సంస్కృతి పరిశ్రమ’ -
వీళ్లంతా మన సంస్కృతిని మార్చేవాళ్లే, కొత్తగా తయారు చేసేవాళ్ళే. అన్నింటికన్నా అతిపెద్ద
భాగస్వామ్యం మాత్రం మనమే. మన పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్, ఫామిలీ, మీరు, నేను, మనమందరం.
మనం గనక ఇవన్నీ చూడడం, వినడం, కొనడం, మొత్తానికే ఈ చెత్త ని పట్టించుకోవడం
మానేస్తే… వాళ్లకి అవన్నీ చేసే ధైర్యం ఎక్కడిదండీ? చెత్త తయారు చేసేవాళ్ళుండరు,
చేయించేవాళ్లుండరు, అసలు చెత్త తీసేవాళ్ళ అవసరం రానే రాదు.


మనం సెల్ఫీ తీస్తున్నది మన ముఖాన్ని మాత్రమే కాదు, మన క్యారెక్టర్ ని, మన మేధస్సుని,
మన మనస్తత్వాన్ని, మన విలువలని, మన జీవితాన్ని. మనం లావుగా ఉంటే బాగాలేము,
సన్నగా ఉంటే పిల్ల దొరకదు, నల్లగా ఉంటే ఉద్యోగం రాదు, తెల్లగా ఉంటే మనిషి అదోరకమని,
మనం ఇలాగుంటే అలాగ, అలాగుంటే ఇలాగ, మనకు నచ్చినట్టు ఉంటే మరోలాగా అర్థం వచ్చేలా,
వేరొకరిలాగుంటే తప్ప నువ్వు బ్రతికున్న మనిషివి కావు అని చెప్పే కితాబు, సర్టిఫికెట్ మనకు
అవసరం లేదు. ఇంతుంటేనే సంతోషం, ఇన్ని ఉంటేనే సుఖం అని హిత బోధ చేసే ‘జ్ఞ్యానం’
మనకక్కర లేదు. ఏ జిలుగు మిళుగులు లేకుండా, ఏ పౌడరు అత్తరూ పూసుకోకుండా,
ఏ బార్బీ గౌనూ డిజైనర్ టీ షర్ట్ వేసుకోకుండా, కళ్ళల్లో నవ్వు కానీ కన్నీరు కానీ కనబడకుండా
చేసే నల్ల కళ్లద్దాలు లేకుండా, లావైతేనేమి-నలుపైతేనేమి-సన్నమైతేనేమి-తెలుపయితేనేమి-
ధనవంతులైతేనేమి-పూరిగుడిసెలో ఉంటేనేమి-ఈ జీవితం నాకు దక్కిన గొప్ప అవకాశం,
ఈ బతుకు నాకొక మంచి ఛాలెంజ్, నేను నేనే కాని మరొకర్ని కాదన్న ఆత్మ సాక్షాత్కారంతో
అద్దం ముందు నగ్నంగా నిలబడి… ఇది నేను అని పరిపూర్ణంగా అంగీకరించాలి.


మనని మనంగా, మనకు మనంగా ఆమోదించి తోడుండే కుటుంబం వైపు, సమాజం వైపు
మనం అడుగులేద్దాం. అప్పుడు తీసుకుందాం ఒక నిజమైన సెల్ఫీ.


“లెటర్స్ తో ఆ స్ట్రేంజర్”

సంతోష్ కొర్తివాడ, 2018 

Copyright © All rights reserved.
Using Format